Home > తెలంగాణ > Telangana Elections 2023 > Seethakka : అర్ధరాత్రి వేళ RO ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన ఎమ్మెల్యే సీతక్క

Seethakka : అర్ధరాత్రి వేళ RO ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన ఎమ్మెల్యే సీతక్క

Seethakka : అర్ధరాత్రి వేళ RO ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన ఎమ్మెల్యే సీతక్క
X

ములుగులో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న MLA అభ్యర్థి సీతక్క(ధనసరి అనసూయ) గత అర్ధరాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల ఈవీఎం బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. అంతకుముందు ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో RO, ITDA PO అంకిత్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన చేపట్టారు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌ అక్కడికి చేరుకొని సముదాయించినా.. స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌ సూచన మేరకు నాయకులు సీతక్క మరో ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ఫొటోను బ్యాలెట్‌పై పొందుపరుస్తామని సమాధానమిచ్చి రిటర్నింగ్‌ అధికారి వెళ్లిపోయారు. కానీ ఆయన హామీలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు నిరసన కొనసాగించారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలో ప్రచారం నిర్వహించిన సీతక్క అర్ధరాత్రి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడి.. అక్కడే బైఠాయించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాత్రి 2 గంటలు దాటినా సీతక్క ఆందోళన కొనసాగింది.

ములుగు అసెంబ్లీ స్థానానికి వివిధ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ లు అందరూ కలిపి 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నెల 30న ఎలక్షన్స్ జరగనుండగా.. ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఫోటోలు, వారి పార్టీలకు కేటాయించిన గుర్తులతో ఈవీఎంలు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు సంబంధించిన ఫోటోలు సరిగా కనిపించకుండా చిన్నదిగా ప్రింట్ చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆర్వో ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు.పోటీలో ఉన్న సీతక్క ఫోటోలు చిన్నవిగా ముద్రించారని, ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ పార్టీ కనుసనల్లో పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ లో పారదర్శకత పాటించాలంటూ ఆర్వో ఆఫీస్ ఎదుట బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




Updated : 21 Nov 2023 8:46 AM IST
Tags:    
Next Story
Share it
Top