Mynampally Hanumanth Rao : బీజేపీని ఇక్కడ తిట్టి.. ఢిల్లీకెళ్లి మోదీ కాళ్లు పట్టుకుంటారు: మైనంపల్లి
X
మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి నోటికి పనిచెప్పారు. తన గురించి అవాకులు చెవాకులు పేలిన మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. తాజాగా తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా చేసిన ప్రచారంలో కేటీఆర్ చేసిన కామెంట్లపై మైనంపల్లి తీవ్రంగా స్పందించారు. వయసు, స్థాయికి మించి మాట్లాడుతున్నావంటూ ఏకవచనం, పరుష పదజాలంతో దూషించారు. తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించిన మైనంపల్లి.. ఎవరి చరిత్రలు ఏమిటో తెలుసుకోవాలని సూచించారు. తనను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన మైనంపల్లి.. నువ్వు, నీ తండ్రి ఎన్ని వేషాలు వేసినా ఇక్కడ చెల్లదంటూ కేటీఆర్ పై మండిపడ్డారు.
తనగురించి మరోసారి నోరుజారితో బాగుండదంటూ హెచ్చరించారు. తాను ముందు నుంచి ఉద్యమంలో ఉన్నానని, కేటీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ ఎవరికీ చెప్పకుండా మాటిమాటికీ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీని ఇక్కడ తిట్టి ఢిల్లీకెళ్లి కాళ్లుపట్టుకుంటారని కేసీఆర్, కేటీఆర్ ను ఎద్దేశా చేశారు. మల్కాజ్ గిరి, మెదక్ ల్లో ఓడిపోతున్నామనే భయంతో తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.