నల్గొండలో బీఆర్ఎస్ అసమ్మతి నేతకు చెక్
X
నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నల్లగొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై.. ఇన్నాళ్లకు బీఆర్ఎస్ ఓ నిర్ణయం తీసుకుంది. నల్లగొండలోని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా మీటింగ్స్ పెట్టి ప్రచారం చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఇకనుంచి రామరాజు నిర్వహించే ఏ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నొద్దని సూచించారు. కాదని పాల్గొంటే వారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు.
కాగా దీనిపై స్పందించిన పిల్లి రామరాజు.. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ నేతగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు తనను సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.