Neelam Madhu : బీజేపీతో కుదరని డీల్.. బీఎస్పీలో చేరిన నీలం మధు
X
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పటాన్‌చెరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇటీవలే పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ కు ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. మొదట టికెట్ ప్రకటించిన అధిష్టానం.. ఆ తర్వాత సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఒత్తిడితో చివరి క్షణంలో కాటా శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై నీలం మధు వర్గం అసహనం వ్యక్తం చేసింది. కాగా, ఆయన తాజాగా బీఎస్పీలో చేరనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నీలం మధు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. అయితే పటాన్ చెరు బీజుపీ టికెట్ ఇప్పటికే ప్రకటించడంతో.. ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈరోజు నామినేషన్ కు ఆఖరి రోజు కావడంతో.. నీలం మధు బీఎస్పీ తరఫున శ్రేణులతో కలిసి నామినేషన్ వేయనున్నారు. ఎట్టకేలకు పోటీలో నీలం మధు నిలవనున్నారు. టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. తన జాతిని నమ్మించి గొంతు కోసిందని, ముదిరాజ్ ల ఆత్మ గౌరవాన్ని చులకన చేశారని కాంగ్రెస్ పై నీలం మధు తీవ్ర ఆరోపిణలు చేశారు. తనకు జరిగిన మోసానికి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని అవమానాలు చేసిన బరి తెగించి కొట్లాడతా. బరా బర్ పటాన్ చెరు ఎమ్మెల్యే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు.