తేలని టికెట్ల పంచాయితీ.. కాంగ్రెస్ వార్ రూంలో ఇద్దరు ఎంపీల వార్
X
కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం హాట్ హాట్గా కొనసాగుతోంది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేసే స్థానాల్లో రేవంత్ రెడ్డి మరో ఇద్దరి పేర్లు కొత్తగా చేర్చడంపై కోమటిరెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో కొత్త పేర్లు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దానిపై స్పందించిన రేవంత్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ, కేడర్ పరిస్థితి తనకు తెలుసని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త పేర్లు చేర్చడంపై స్క్రీనింగ్ కమిటీలోని మిగతా సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. వారంతా కోమటిరెడ్డికి మద్దతుగా రేవంత్తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఈ వాగ్వాదం కొనసాగగా.. చివరకు టికెట్ల ఎంపిక అంశాన్ని రాహుల్ గాంధీ వద్దనే తేల్చుకుందామని ఇద్దరు నేతలు సవాల్ విసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరికి చోటు కల్పిస్తూ హైకమాండ్ ఇటీవలే నిర్ణయిం తీసుకుంది. బలరాం నాయక్, షబ్బీర్ అలీ కమిటీలో సభ్యులుగా ఉటారని చెప్పింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న స్క్రీనింగ్ కమిటీ మీటింగుకు ఆ ఇద్దరు నేతలను అనుమతించకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.