ఈసారి పాంచ్ పటాకేనా..? ఆదిలాబాద్లో జోగు రామన్నకు అగ్నిపరీక్ష
X
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీ అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ ఉండేలా కనిపిస్తుంది. అందులో ఆదిలాబాద్ నియోజకవర్గం ఒకటి. ఆ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ నుంచి కంది శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్ పోటీ చేస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి పోటి చేసి విజయం సాధించిన జోగు రామన్న.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 2012 బై ఎలక్షన్స్, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన రామన్న పాంచ్ పటాకా కొట్టాలని చూస్తున్నారు. కాగా ఈసారి ఆయన విజయం అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఎలాగైనా బీజేపీ జెండా పాతాలని పాయల్ శంకర్ చూస్తుంటే.. ఫస్ట్ టైం నిలబడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నాడు.
ఇన్నేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న రామన్నకు.. చాలాచోట్ల నిరసన సెగలు తగులుతున్నాయి. ఆయన వెళ్లిన ప్రతీచోట జనాలు నిలదీస్తున్నారు. గొర్రెల యూనిట్లు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూం, దళిత బంధు, బీసీ బంధు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవి చాలదన్నట్లు ఇచ్చిన హామీలు నాకా కొరాటా ప్రాజెక్టు, ఆదిలాబాద్ టౌన్లో రైల్వే బ్రిడ్జిలు పూర్తి చేయకపోవడం, రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం రామన్నపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఆయనకు వ్యతిరేకంగా మరో బీఆర్ఎస్ వర్గమే నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ రంగినేని మనీశాతో పాటు.. ఉద్యమ కారులు వ్యతిరేకంగా ఉన్నారు. మనీశా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికితోడు జిల్లాలోని పలువులు ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ క్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం నమ్మకం ఉంచింది. పార్టీలో చేరిన ఆరునెలళ్లోనే టికెట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సీనియర్ల మద్దతు లేకుండానే ప్రచారం కొనసాగిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో పాటు, పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. వీరిని కాదని కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. కొందరు పార్టీకి రాజీనామా కూడా చేశారు. సంజీవ రెడ్డి రెబల్ గా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది.