Home > తెలంగాణ > Telangana Elections 2023 > Shejal : 'ఆ ఎమ్మెల్యేపై నా పోరాటం ఆగదు'.. కాంగ్రెస్‌లో చేరిన శేజల్

Shejal : 'ఆ ఎమ్మెల్యేపై నా పోరాటం ఆగదు'.. కాంగ్రెస్‌లో చేరిన శేజల్

Shejal : ఆ ఎమ్మెల్యేపై నా పోరాటం ఆగదు.. కాంగ్రెస్‌లో చేరిన శేజల్
X

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత దుర్గం చిన్నయ్యపై కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న అరిజన్‌ డెయిరీ సీఈఓ శేజల్‌.. గురువారం మాజీ మంత్రి గడ్డం వినోద్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తనపై ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టాడని కొన్నాళ్ల క్రితం దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరిన శేజల్ కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే నిన్న బెల్లంపల్లికి చేరుకున్న ఆమె... గడ్డం వినోద్‌తో పాటు ఇతర నాయకులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నయ్యపై తన పోరాటం ఆగదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరిజన్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదినారాయణపై పోలీసులతో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం తమ వైపు ఉండడంతో బోర్డు మీటింగ్‌లో పీడీ యాక్టు రద్దు చేశారన్నారు. అమాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయించడం చిన్నయ్యకు అలవాటుగా మారిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని అప్పట్లో ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ ​ఆరోపించడం సంచలనంగా మారింది. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించారని ఆరోపించారు. అమ్మాయిలను ట్యాబ్లెట్ అంటూ కోడ్ లాంగ్వేజ్‌లో చేసిన వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు, అమ్మాయిల ఫోటోలు రిలీజ్ చేశారు. అలాగే వేధింపులకి సంబంధించి ఆడియోలను కూడా విడుదల చేశారు.

శేజల్ ఆరోపణలపై తనకెలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే చిన్నయ్య. చాలామంది రైతుల దగ్గర్నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి శేజల్ అండ్ కో మోసం చేసిందన్నారు. బాధిత రైతులు తనను సంప్రదించడంతో ఆమె వ్యవహరాన్ని పోలీసుల దృష్టికి మాత్రమే తీసుకెళ్లానని చెప్పారు. అయితే చిన్నయ్య వ్యవహారం బయటపెట్టినందుకే తనపై కక్షతో అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేశారు శేజల్. ఆ క్రమంలో ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్, జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశారు ఆస్పత్రిలో చికిత్స పొందాక కోలుకుని ఇప్పుడు ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరడంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.




Updated : 10 Nov 2023 3:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top