Pawan Kalyan Janasena : పోటీ చేసిన 8 చోట్ల జనసేన దక్కని డిపాజిట్లు
X
తెలంగాణలో జనసేన పార్టీని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బీజేపీతో పొత్తులో భాగంగా 8చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. కూకట్పల్లి స్థానంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నా అక్కడ కూడా జనం పట్టించుకోలేదు. సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా పడతాయని భావించినా అక్కడి ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పట్టం కట్టారు.
పొత్తులో భాగంగా బీజేపీ గ్రేటర్ పరిధిలో కూకట్ పల్లి సీటును మాత్రమే కేటాయించింది. అక్కడ గెలుపు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ భారీ బహిరంగ సభతో పాటు రెండ్రోజుల పాటు రోడ్ షో నిర్వహించారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. ఇక తాండూరు, నాగర్ కర్నూలు, కోదాడ నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు రాలేదు.
ఖమ్మం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోనూ జనసేనను ఎవరూ పట్టించుకోలేదు. మిగిలిన 8 నియోజకవర్గాలతో పోలిస్తే ఒక్క కూకట్పల్లిలో మాత్రం కాస్త గౌరవప్రమదమైన ఓట్లు వచ్చాయంటే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకుంది. కానీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీతో పొత్తుపెట్టుకుంది. దీంతో బీజేపీ తమ పార్టీకి అంతగా బలం లేని 8 సీట్లను జనసేనకు ఇచ్చింది.