Assembly Election 2023 : సభలు, రోడ్ షోలు.. ప్రచారంలో దూసుకుపోయిన పార్టీలు..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరాయి. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆఖరి రోజున రాజకీయ పార్టీలన్నీ చివరి నిమిషం వరకు ప్రచారంతో హోరెత్తించాయి. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ గవర్నమెంట్ ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉండగా.. కర్నాటక ఎన్నికలు ఇచ్చిన జోష్ తో తెలంగాణలోనూ అధికారం హస్తగతం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకొచ్చిన బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేస్తామని చెప్పింది. పార్టీలవారీగా చూస్తే బీఆర్ఎస్ సభల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది.
96 సభల్లో పాల్గొన్న కేసీఆర్..
ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాకముందే బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. పార్టీ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తించారు. అక్టోబరు 15న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. రోజుకు రెండు నుంచి నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ప్రచారం ముగిసేనాటికి మొత్తం 96 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ 60 రోజుల్లో 30 పబ్లిక్ మీటింగ్‌లు, 70 రోడ్ షోలతో పార్టీ క్యాడర్‌లో జోష్ నింపారు.
రాహుల్ 23.. ప్రియాంక 26 సభలు..
కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ప్రచారంలో దూకుడుగా వ్యహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రంలో మొత్తం 10 సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 23, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో ప్రసంగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 55 సభల్లో, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య 3, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 10, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్ 4 సభల్లో పాల్గొన్నారు.
మోడీ 5 రోజుల ప్రచారం..
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ స్థాయి నాయకులు ప్రచార రంగంలో దిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ తదితరులు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ 5 రోజుల పాటు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 8 సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ, కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్‌లో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభ, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ నుంచి కాచిగూడ వీర్‌సావర్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న మోడీ.. క్యాడర్‌లో జోష్ నింపారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఐదు రోజుల చొప్పున ప్రచారం నిర్వహించారు. మరి ఈ నేతలందరి ప్రచారం ఎలాంటి ప్రభావం చూపిందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే.