TS Assembly Elections 2023 : అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం - రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాజస్థాన్లో ఉచిత వైద్యం హామీని నిలబెట్టుకున్నామని ఎలాంటి అనారోగ్యం వచ్చినా రూ. 25 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా అందిస్తున్నామని చెప్పారు. ఛత్తీస్ఘడ్లో రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారు. దేశంలో వరికి అత్యధిక ధర ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.
కర్నాటకలో హామీ ఇచ్చిన 5 గ్యారెంటీలను ప్రభుత్వం కొలువుదీరిన తొలిరోజే అమల్లోకి తెచ్చామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించామని చెప్పారు. రైతులు, మహిళల ఖాతాల్లో నెలనెలా డబ్బులు వేస్తూ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆదివాసీల భూములపై వారికి హక్కులు తిరిగి ఇస్తామని రాహుల్ ప్రకటించారు. పోడు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. యూపీఏ హయాంలో ఆదివాసీల బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ప్రజలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు, కౌలు రైతులకు రూ. 12 వేలు, గృహజ్యోతి పథకం కింద 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం కింద రూ. 5లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు పెన్షన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. యువ వికాసం పథకం కింద యువతీయువకులకు రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేయనునున్నట్లు చెప్పారు. కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.