TS Assembly Elections 2023 : నానుంచి పదవి, ఇల్లు లాక్కున్నా.. మీ గుండెల్లో చోటిచ్చారు: రాహుల్ గాంధీ
X
బీజేపీ తన పదవిని, ఇంటిని లాక్కుందని.. తనకు ఇల్లు లేకపోయినా ప్రజల గుండెల్లో చోటుంటే చాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన రోడ్ షోలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్.. కేసీఆర్ ఆస్తుల మీద ఈడీ, ఐటీ విచారణలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు చీకటి ఒప్పందాలు జరుపుకున్నాయపి ఆరోపించారు. పార్లమెంట్ లో బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతునిచ్చిందని, అక్కడే రెండు పార్టీలు ఒక్కటని అర్థం చేసుకోవాలన్నారు. ఈసారి జరిగే ఎలక్షన్స్ లో చూసి జాగ్రత్తగా ఓటేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ దోచుకున్న డబ్బంతా సంక్షేమం రూపంలో తిరిగి పంచుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలతో తనకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ పాలన నుంచి ఈ బంధం కొనసాగుతుందని చెప్పారు. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీజేపీతో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతుందని మండిపడ్డారు. బీజేపీతో పోరాడుతున్నందుకు తనపై కేసుపెట్టారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం పక్కా.. దొరల పాలనను అంతం చేయడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.