Revanth Reddy And Bhatti Vikramarka : సీఎం బరిలో రేవంత్, భట్టి.. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్ నిర్ణయం..!
X
తెలంగాణలో కాంగ్రెస్ తొలిసారి అధికారం చేజిక్కించుకుంది. స్వరాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత హస్తం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ అత్యధిక సీట్లలో విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ నుంచి సీఎం ఎవరవుతారన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్లో ఎందరో సీనియర్ నేతలు ఉన్నా.. ప్రస్తుతం ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాగా.. మరొకరు దళిత నాయకుడు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్తో పాటు కామారెడ్డిలో పోటీ చేశారు. అయితే కామారెడ్డిలో ఓటమిపాలైన ఆయన.. కొడంగల్ లో మాత్రం 30 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. అటు మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి విజయం సాదించారు. వీరిద్దరిలో ఒకరికి సీఎం అయ్యే ఛాన్సుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
నిజానికి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే తమ మార్కు చూపించారు. సందు దొరికినప్పుడల్లా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌లో జోష్ నింపారు. బీఆర్ఎస్కు ధీటుగా కాంగ్రెస్కు మళ్లీ జీవం పోశాడు.
మరొకవైపు భట్టి విక్రమార్క సైతం పాదయాత్రతో కాంగ్రెస్‌కు మరింత ఊపు తెచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలకు వీర విధేయుడుగా ఉన్న ఆయన సీఎం రేసులో తానున్నానంటూ మనసులో మాట బయటపెట్టారు. ఇదిలా ఉంటే కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇది రేవంత్ కు కలిసొచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే కర్నాటకలో సీఎం ఎంపికకు కాంగ్రెస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే తీసుకుంది. డీకేకు పాలనాపగ్గాలు అప్పజెప్తారని భావించినా సీనియర్ నేత సిద్ధరామయ్యకు అవకాశం దక్కింది. డీకేకు డిప్యూటీ సీఎం పోస్టుతో సరిపెట్టింది. ఈ లెక్కన తెలంగాణ సీఎం ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందడంతో ఒకట్రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశమున్నట్లు సమాచారం.