Revanth Reddy : కాంగ్రెస్ గెలుపు శ్రీకాంత చారికి అంకితం: రేవంత్ రెడ్డి
X
కాంగ్రెస్ గెలుపును మలిదశ ఉద్యమంలో తొలి కాగడా అయిన శ్రీకాంత చారికి అంకితం ఇస్తున్నామని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో పోటీ చేసిన సీఎం కేసీఆర్ ను ఓడిస్తున్నామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓడిపోతున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఈ గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓడిపోతామని అనుకున్నప్పుడల్లా కేసీఆర్ నియోజకవర్గాలు మారుతున్నారని.. అలా సిద్దిపేట, కరీంనగర్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ గెలుపు శాశ్వతం అని నమ్మాడని, అమరుల త్యాగాల పునాదుల మీద తన అధికారం చేపట్టాడని ఆరోపించారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోందని రేవంత్ తెలిపారు.
తెలంగాణ ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని స్పష్టం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దొరల తెలంగాణ పోయి.. ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవ్వబోతోందని చెప్పారు. ఏ సర్వే ఫలితం చూసినా కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టం అవుతుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుందని రేవంత్ వివరించారు.