Anumula Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
X
తెలంగాణ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వేదికైంది. తెలంగాణలో 'ప్రజా ప్రభుత్వం' ప్రమాణ స్వీకారం పేరుతో ఏర్పాటు చేసిన ఆ వేదికపై ఈ రోజు మధ్యాహ్నం 1:21 గంటలకు గవర్నర్ తమిళిసై.. రేవంత్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినట్లయింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నుంచి గెలిచిన మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు హాజరయ్యారు. అంతకుముందు ఎల్బీ స్టేడియం మైదానం నుంచి ప్రత్యేక వాహనంలో సోనియా గాంధీ తో సహ రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం చేస్తూ.. వేదిక వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. స్టేడియం మధ్యలో నడుస్తూ ప్రజల అభివాదాల మధ్య వేదికపై చేరుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.