Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయం మార్పు
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పులు జరిగాయి. తొలుత ఆయన ఉదయం 10.28కి ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ తెలిపింది. అయితే తాజాగా దాంట్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
మరోవైపు రేవంత్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన రేవంత్.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఎంపీ మాణిక్కం ఠాగూర్తో ఆయన సమావేశమై ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఇవాళ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్లను కలిశారు. తన ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.