TS Assembly Elections 2023 : ‘రైతుబంధు’ ఆపండి... ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి
X
రైతు బంధు పథకాన్ని నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్ పార్టీ . రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేలా అధికార పార్టీ ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశముందని అభిప్రాయపడుతూ.. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు రైతుబంధు సాయం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్వయంగా ఈ నెల 23న ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు నామినేషన్లకు ముందే రైతుబంధు నిధుల్ని విడుదల చేయాలని లేదా పోలింగ్ తేదీ తర్వాత అందేలా చూడాలని పేర్కొన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని వాడుకుని సరిగ్గా పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఈ సాయాన్ని అందించే అవకాశమున్నదని, ఈ స్కీమ్‌ను ప్రభుత్వం ఉనికిలోకి తెచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఇది జరిగిందని కమిషన్‌కు ఇచ్చిన మెమొరాండంలో పేర్కొన్నారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కలిగిన కమిషన్.. రైతుబంధు, దళితబంధు విషయంలో తగిన తీరులో వ్యవహరించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ నవంబరు 3న ప్రారంభం కానున్నందున అప్పటికల్లా రైతుబంధు నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చూడాలని, లేదంటూ పోలింగ్ నవంబరు 30న జరగనున్నందున ఆ తర్వాత జమ చేసేలా ఆలోచించాలని కోరారు. దళితబంధు విషయంలోనూ ఎలక్షన్ కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ తీరు తప్పుబడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ ఈ విషయంపై మండిపడుతూ.. చిల్లర రాజకీయాల కోసం.. సమాజానికై నిస్వార్ధంగా కష్టపడే రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, భవిష్యత్తు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదని అన్నారు.