Sonia Gandhi : సోనియా పుట్టిన రోజు 2 గ్యారెంటీలు ప్రారంభించడం సంతోషంగా ఉంది - సీఎం రేవంత్
X
సోనియా గాంధీ 78వ పుట్టిన రోజు వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 78కిలోల కేక్ ను పీసీసీ మాజీ చీఫ్ వి. హనుమంతరావుతో కట్ చేయించారు.
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజు నుంచి ప్రారంభించనుండటం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం రోజునే తెలంగాణ ప్రకటన వచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమె తెలంగాణ ఇచ్చారని చెప్పారు.
అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోనియా గాంధీ కలలుగన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు. రాష్ట్ర సంపద ప్రజలు పంచుతామని, జనం మెచ్చేలా తమ పాలన ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.