Speaker Gaddam Prasad Kumar : ప్యానల్ స్పీకర్లను ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావులను స్పీకర్ ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రకటించారు.
కాగా గత పదేళ్ల పాలనపై మాట్లాడమంటే బీఆర్ఎస్ భయపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 10ఏళ్లను వదిలేసి ఉమ్మడి పాలన గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంత చెప్పినా ఆ ఎన్నారైలు అర్ధచేసుకోరని విమర్శించారు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాసౌమ్య స్ఫూర్తి ముఖ్యమన్నారు. గత పాలనలో కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. పొతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ మీద కొట్లాడింది పీజేఆర్ అని తెలిపారు.
అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని చెప్పారు. ముంబై, బొగ్గుబాయ్, దుబాయ్ అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉండేదని కేటీఆర్ విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవన్నారు.కాంగ్రెస్ సభ్యులు ఇందిరమ్మ పాలన గురించి మాట్లాడినప్పుడు వారి హయాంలో జరిగిన అరాచకాలపై తాము మాట్లాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.