BRS And Congres Parties : ఎన్నికల సంగ్రామం... రాళ్లు రువ్వుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
X
తెలంగాణలో ఎన్నికల 'సంగ్రామం' మొదలైంది. ఇంకా పోలింగ్ కూడా జరగకముందే.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు కోట్లాటకు సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈ ఉద్రిక్త సంఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరూ ఒకేసారి నామినేషన్‌కు వెళ్లడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
నామినేషన్ సందర్భంగా గురువారం నాడు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకేసారి భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలు ఎదురెదురుగా రావడంతో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్‌ఎస్ నేతలపై విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వాహనం దిగి వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు.