KCR : యాదయ్య వెరైటీ, నాకే ఆర్డర్ వేస్తడు.. కేసీఆర్
X
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సుడిగాలిగా తిరుగుతున్న సీఎం కేసీఆర్ విపక్షాలపై ఘాటు విమర్శలే కాకుండా అప్పుడప్పుడూ సరదా కబుర్లు కూడా చెబుతున్నారు. సోమవారం చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పార్టీ అభ్యర్థి కాలే యాదయ్యతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడాడు. అందరికీ తను ఆర్డర్లు వేస్తే ఆయన తనకు ఆర్డర్ వేస్తాడని, ఆయన వివిచిత్రమైన దోస్త్ అని అన్నారు. ఆయన చీమకు, దోమకు కూడా హాని తలపెట్టని మంచి మనిషిని, ఆయనను గెలింపించుకోవాల్సిన బాధ్యత చేవేళ్ల ప్రజలపై ఉందని అన్నారు.
‘‘నేను అందరికీ ఆర్డర్ వేస్తే యాదయ్య నాకు ఆర్డర్ వేస్తాడు. అతడు నా దగ్గరోడు కాబట్టి ఏం చెప్పినా చేస్తా. ఇక్కడికి రాంగానే.. ఎమ్మెల్యే సాబ్ ఏం ఆర్డర్ అని అడుగత. ఆయన ఆర్డర్ వేస్తాడు. ఆ పని చేసేదాకా ఊరుకోడు. మొండిగా పట్టుబట్టి చేయించుకుంటాడు. ఈసీ వాగు, మూసీ వాగు మీద బ్రిడ్జిలు కట్టియ్యాలని నన్ను, నా మంత్రులను ఆగమాగం పట్టించిండు. జనాభా పెరిగింది, గ్రామాలకు రాకపోకలు పెరిగినయ్... మాకు తప్పనిసరిగా బ్రిడ్జి కావాలే అని పట్టుబట్టి కంపల్సరీ నాకు బ్రిడ్జిలు కావాలని పట్టుబట్టిండు. పంచాయతీ రాజ్, రోడ్ల మంత్రులకు చుక్కలు చూపిండు’’ అని అన్నారు. ప్రజాసేవకే అంకితమైన యాదయ్యను గెలిపించి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.