KCR : తెలంగాణ భవన్‌లో BRS అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
X
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. పార్టీ మేనిఫెస్టో ప్రకటన.. బీఫామ్ ల అందజేత నేపథ్యంలో ఎన్నికల ప్రచారంపై పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మళ్లీ విజయం మనదే.. ఎవరూ తొందరపడొద్దు అని అభ్యర్థులకు తెలిపారు. ప్రతీ కార్యకర్తతో నేతలు మాట్లాడాలని, కోపతాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలని సూచించారు. ఇక తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులు.. అంతా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి, అభ్యర్థులకు బీఫామ్ లు అందజేయనున్నారు కేసీఆర్.
అంతకుముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ కు... పార్టీ నాయకులు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పార్టీ ఆఫీస్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు కేసీఆర్ . ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక మరికాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ బీ-ఫారాలు అందజేయనున్నారు. అనంతరం అభ్యర్థులతో కలిసి కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. ఆపై సాయంత్రం హుస్నాబాద్ లో జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొంటారు. హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్ ఏం చేయబోతున్నదన్న మేనిఫెస్టో ద్వారా పూర్తి ప్రణాళికను వివరించనున్నారు కేసీఆర్ . హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్ ప్రజలకు వెల్లడించనున్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి. ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.