Telangana Assembly Elections: ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా త్రిముఖ పోరే ఉన్నా.. చాలా పార్టీలు కూడా బరిలో దిగి.. ఎన్నికలను రంజుగా మార్చుతున్నాయి. అయితే ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలామంది కొత్తవారు కూడా ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఐపీఎస్ మాజీ అధికారి ప్రవీణ్‌కుమార్ సహ.. బీఆర్ఎస్ నేత, దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత, ఇంకా పలువురు ఈ ఎన్నికల బరిలో తొలిసారి దిగుతున్నారు.
రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్ తరఫున తొలిసారి పోటీ చేస్తున్న వాళ్లు కేవలం నలుగురే. అందులో ఒకరు దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి భూక్యా జాన్సన్, కోరుట్ల నుంచి డాక్టర్ సంజయ్, ములుగు నుంచి భాగ్యజ్యోతిలకు సైతం ఇవే తొలి ఎన్నికలు.
బీఆర్ఎస్ కు ధీటుగా పోటీనిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఎక్కువ మంది కొత్తవారికి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశమిచ్చింది. ఇప్పటివరకు టికెట్లు పొందిన వారిలో రావి శ్రీనివాస్ (సిర్పూరు), అజ్మీరా శ్యామ్‌నాయక్(ఆసిఫాబాద్), కంది శ్రీనివాస్‌రెడ్డి(ఆదిలాబాద్), వెడ్మ బొజ్జు(ఖానాపూర్), ఎం.సునీల్‌కుమార్ (బాల్కొండ), వొడితల ప్రణవ్(హుజూరాబాద్), మైనంపల్లి రోహిత్‌రావు(మెదక్), బండి రమేశ్(కూకట్‌పల్లి), కస్తూరి నరేందర్ (రాజేంద్రనగర్), మెగిలి సునీత(గోషామహల్), చిట్టెం పర్ణిక (నారాయణపేట), అనిరుధ్‌రెడ్డి(జడ్చర్ల), వారిటి శ్రీహరి(మక్తల్), రఘువీర్‌రెడ్డి(నాగార్జునసాగర్), వెన్నెల(కంటోన్మెంట్), మామిడాల యశస్విని(పాలకుర్తి), మురళీ నాయక్(మహబూబాబాద్), నాయిని రాజేందర్‌రెడ్డి(వరంగల్ పశ్చిమ), కేఆర్ నాగరాజు(వర్ధన్నపేట), పరమేశ్వర్‌రెడ్డి(ఉప్పల్), నీలం మధు(పటాన్‌చెరు), పి.శ్రీనివాస్(కరీంనగర్), మేఘారెడ్డి(వనపర్తి), డా.మట్టా రాగమయి(సత్తుపల్లి), మాలోత్ రాందాస్(వైరా) ఉన్నారు.
బీజేపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థుల్లో... రాణి రుద్రమదేవి(సిరిసిల్ల), వి.మోహన్‌రెడ్డి(బోధన్), పి.రాకేశ్‌రెడ్డి(ఆర్మూర్), దినేశ్(నిజామాబాద్ గ్రామీణ), భోగ శ్రావణి(జగిత్యాల), కందుల సంధ్యారాణి(రామగుండం), సంగప్ప(నారాయణఖేడ్), పూసరాజు (ముషీరాబాద్), మిథున్‌కుమార్ రెడ్డి(మహబూబ్‌నగర్), దశమంతరెడ్డి(జనగామ), కుంజ ధర్మారావు(భద్రాచలం), రామలింగేశ్వరరావు(సత్తుపల్లి), బాలరాజు(పినపాక), రవికుమార్ (పాలేరు), అశ్వత్థామరెడ్డి(వనపర్తి), రామచంద్ర రాజనర్సింహా (జహీరాబాద్), పడాల శ్రీనివాస్(ఆలేరు), డా.కె.ప్రసాదరావు(పరకాల) కొత్తవారు ఉన్నారు.
ఇక కేఏ పాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీ కూడా ఎన్నికల సమరంలో పాల్గొంటుంది. ఇప్పటివరకు ఆ పార్టీ తరఫున టికెట్లు పొందిన 12 మందిలో అంతా కొత్తగా పోటీ చేస్తున్న వారే. ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న వారు కూడా దాదాపు అందరూ కొత్తవారే. ఇక సీఎం కేసీఆర్ కు పోటీగా కామారెడ్డిలో పౌల్ట్రీ రైతులు పోటీచేయబోతున్నట్లు తెలుస్తుంది. వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటే.. ఆ రైతులు కూడా కొత్తగా పోటీచేస్తున్నవారేనని చెప్పుకోవాల్సి ఉంటుంది.