Telangana CLP Meeting : ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్.. కాసేపట్లో సీఎల్పీ భేటీ..
X
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని.. ప్రజలు ఈ సారి కాంగ్రెస్కు పట్టం కట్టారు. హస్తం పార్టీ 65 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ క్రమంలో కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. ఉదయం 9.30 గంటలకు గచ్చిబౌలిలోని ఎల్లా హెటల్లో ఈ సమావేశం జరగనున్న ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.
సీఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సీఎం పదవికి భట్టి విక్రమార్క సైతం పోటీపడినా అధిష్టానం సహా ఎమ్మెల్యేలు రేవంత్కే జై కొట్టినట్లు సమాచారం. ఇక ఇవాళ సాయంత్రమే సీఎం ప్రమాణం స్వీకారం ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.