Home > తెలంగాణ > Telangana Elections 2023 > టీ కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. తగ్గేదేలేదంటున్న బీసీ నేతలు..

టీ కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. తగ్గేదేలేదంటున్న బీసీ నేతలు..

టీ కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. తగ్గేదేలేదంటున్న బీసీ నేతలు..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వాహణకు సర్వసన్నద్ధంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలిచ్చిన జోష్తో తెలంగాణలోనూ విజయఢంకా మోగించాలని భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఈసారి సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. ఈ తంతు పూర్తై నెల దాటినా కాంగ్రెస్ ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేకపోయింది.

34 టికెట్ల కోసం నేతల పట్టు

నిజానికి తెలంగాణ కాంగ్రెస్ అంటేనే నిత్యం ఏదో ఒక వివాదం. గ్రూపు రాజకీయలు, అలకలు, బుజ్జగింపులు సర్వ సాధారణం. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. బీసీలకు టికెట్ల కేటాయింపు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 చొప్పున తమకు 34 టికెట్లు ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏండ్లుగా బీసీ వర్గాలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని, తమకు సరైన ప్రాతినిధ్యం లభించకుండా రెడ్డి సామాజికవర్గ నేతలు అడ్డుకుంటున్నారని వారు ఫైర్ అవుతున్నారు. సమన్యాయం పాటించకుండా కేవలం అగ్రకులాల వారినే అందలం ఎక్కిస్తూ, పార్టీని రెడ్డి కాంగ్రెస్​ లా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మధుయాష్కీ గౌడ్కు కూడా టికెట్ రాకుండా కుట్ర చేస్తుండటమే ఇందుకు నిదర్శమని అంటున్నారు.

అన్యాయంపై నేతల గళం

ఈసారి ఎన్నికల్లోనూ తమకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తేలేదంటున్న బీసీ నేతలు తమ డిమాండ్లను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన నాయకులు రోజుల తరబడి అక్కడే మకాం వేసినా ఫలితం మాత్రం దక్కలేదు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల్లో ఎవరూ వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో రేణుకా చౌదరి అడిగిన వెంటనే సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం, కమ్మ సామాజిక వర్గానికి 10 నుంచి 12 టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని వార్తలు రావడంపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అగ్రకులాలను అందలం ఎక్కించి తమను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

డిక్లరేషన్ సంగతేంటి..?

ఏఐసీసీ గతంలో ప్రకటించిన ఉదయ్పూర్ డిక్లరేషన్ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని బీసీ వర్గం నేతలు నిలదీస్తున్నారు. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​లో భాగంగా పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అణగారిన వర్గాల వారికి సమాన ప్రాధాన్యం కల్పించాలని గతేడాది మేలో జరిగిన చింతన్​ శిబిర్​లోనూ కాంగ్రెస్​ పార్టీ తీర్మానించింది. వన్​ ఫ్యామిలీ.. వన్​ టికెట్ ​ఫార్ములానూ ఆమోదించింది. కుటుంబంలో ఒక నేత యాక్టివ్​గా ఉన్నా.. ఐదేండ్ల తర్వాతే టికెట్​ ఇవ్వాలని డిక్లరేషన్​లో పొందుపరిచింది. ఈ డిక్లరేషన్​ను ఫాలో కావాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యమానికి సిద్ధం

బీసీ నేతలను పట్టించుకోని పక్షంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని ఆ వర్గం నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తమ డిమాండ్లను పార్టీ హైకమాండ్ పట్టించుకోకుంటే ఉద్యమానికి సిద్ధమని వార్నింగ్ ఇస్తున్నారు. తమకు 34 సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీసీల విషయంలో పార్టీ హైకమాండ్ ఓ ఫార్ములా ప్రకారం ముందుకెళ్తోందని కాంగ్రెస్లోని ఓ వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. వారికి 25 అసెంబ్లీ టికెట్లు, 10 ఎమ్మెల్సీ స్థానాలు, ఐదుగురికి లోక్సభ టికెట్, మరో నలుగురు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించేలా ఏఐసీసీ ప్లాన్ సిద్ధం చేసిందని అంటున్నారు. అయితే బీసీ నాయకులు ఆ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34 టికెట్లు ఇవ్వాల్సిందేనని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని అంటున్నారు.

హైకమాండ్పైనే భారం

ఎన్నికల వేళ కాంగ్రెస్లో మొదలైన బీసీల లొల్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ వారి డిమాండ్లను పక్కనబెట్టి అభ్యర్థుల్ని ప్రకటిస్తే బీసీ నేతలు ఉద్యమానికి సిద్ధమని ఇప్పటికే తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న టెన్షన్ కాంగ్రెస్ అధిష్ఠానంలో మొదలైనట్లు సమాచారం. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో బీసీ నేతల పంచాయితీని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Updated : 7 Oct 2023 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top