TS Assembly Elections 2023 : కాంగ్రెస్ రెండో జాబితా ఎప్పుడంటే.. కమ్యూనిస్టులకు ఆ సీట్లు!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చిన్నచిన్న వివాదాలను పక్కనబెట్టి జాబితాలను కొలిక్కి తెస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే జాబితాను ప్రకటించడంతో కాంగ్రెస్ రెండో విడత జాబితాపై కసరత్తు పూర్తి చేసింది. ఆదివారం కూడా ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు అభ్యర్థుల పేర్లపై మంతనాలు జరిపారు. తొలి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 64 సీట్లకు అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. సీపీఎం, సీపీఐలకు ఏ సీట్లు కేటాయించాలన్న దానిపై చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 40 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యారని, 25న(బుధవారం) పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమై మొత్తం 64 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జాబితాను కూడా ఆ రోజే విడుదల చేస్తారని చెప్పాయి.
లెఫ్ట్ పార్టీలో బీఆర్ఎస్‌తో సీట్ల కోసం జరిపిన చర్చల్లో మాదిరే తమతో జరుపుతున్న చర్చర్లో పట్టువదలడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం, చెన్నూరు, మిర్యాలగూడ, వైరా, తదితర సీట్లను తమ కేటాయించాలని వామపక్షలు పట్టుబడుతున్నాయి. మొన్నటివరకు బీఆర్ఎస్‌కు జైకొట్టిన లెఫ్ట్‌తో పొత్తుపెట్టుకుంటే ఆయా స్థానాల్లో ‘హస్తం’ శ్రేణులు అసంతృప్తికి గురై సహకరించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను, సీపీఎంకు మిర్యాలగూడ, వైరాలను ఇస్తామని తమ నేతలు ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వైరా తమకు వద్దని, దానికి బదులుగా పాలేరు కావాలని సీపీఎం డిమాండ్ చేస్తోందని అంటున్నాయి. అయితే పాలేరు తమకు కీలకమని కాంగ్రెస్ పేచీ పెడుతోంది. సోమ, మంగళవారాల్లో లెఫ్ట్ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.