TS Assembly Elections 2023 : కాంగ్రెస్తో పొత్తుపై క్లారిటీ.. సీపీఎం బాటలోనే సీపీఐ?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోటీకి సీపీఎం సిద్ధమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తో పొత్తను తెగదెంపులు చేసుకున్న ఆ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. భద్రాచలం, అశ్వారావుపేటతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 స్థానాలు, ఉమ్మడి నల్గొండలో 4, సూర్యాపేట జిల్లాలో 2, హైదరాబాద్.. మెదక్.. వరంగల్ జిల్లాలో ఒక స్థానంలో తమ అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు చెప్పారు. కాగా అదే బాటలో సీపీఎం నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. పొత్తులో సీపీఐకి కొత్తగూ డెం, సీపీఎంకు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలే ఇస్తామని, అధికారంలోకి వచ్చాక చెరో ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో వామపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ మొదట ఐదు సీట్లు తర్వాత రెండు.. ఇప్పుడు ఒక సీటే ఇస్తామనేసరికి వామపక్షాలు మండిపడుతున్నాయి.
దీంతో సీపీఎం ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోగా.. సీపీఐ ఇవాళ పార్టీ శ్రేణులతో చర్చించి ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో సీపీఎం బాటలోనే సీపీఐ కూడా నడిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సీపీఎం పోటీ చేసే 17 స్థానాలను ప్రకటించగా.. సీపీఐ సైతం అదే స్థాయిలో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కాగా నామినేషన్ల గడువు వరకు తుది నిర్ణయం ప్రకటించకుండా.. తమకు ఆశ కలిగించిన కాంగ్రెస్‌పై లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.