Home > తెలంగాణ > Telangana Elections 2023 > Kishan Reddy : బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా.. కిషన్ రెడ్డి

Kishan Reddy : బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా.. కిషన్ రెడ్డి

Kishan Reddy : బీజేపీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా.. కిషన్ రెడ్డి
X

సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలోనూ, గజ్వేల్‌లోనూ ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఆదివారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నియంతలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.. తెలంగాణలో నిరసన తెలిపే హక్కే లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రజా ఆందోళనలను బీఆర్ఎస్ ప్రభుత్వం అణిచివేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులను కలిసే వీలు లేకుండా పోయిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని.. కేసీఆర్ మాట తప్పారని.. ఉద్యోగ నియామకాల్లో విఫలమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

హామీలు ఇవ్వడం, అమలు చెయ్యకపోవడం, మోసం చేయ్యడం సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచీ అలావాటే అన్న కిషన్ రెడ్డి… దళితుణ్ని సీఎం చేస్తానన్న కేసీఆర్ చెయ్యలేదని అన్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి, ఇవ్వలేదన్నారు. ఇక ఉద్యోగ నియామకాలు అస్సలు లేవన్నారు. పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టూ భర్తీ కాలేదన్నారు. గ్రూప్ 1 రద్దు కావడంతో 30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణ యువత సునామిలా విజృంభించి బీఆర్‌ఎస్‌ను తుడిచిపెడుతుందని ప్రకటించారు.

కొత్త సచివాలయానికి కూడా కేసీఆర్ రావడం లేదని.. ఇవాళ సాధారణ ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డను చూస్తే కడుపు తరుక్కుపోతోందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చూసొచ్చానన్న కిషన్ రెడ్డి.. అది కుంగిపోవడమే కాకుండా, పిల్లర్లకు కూడా పగుళ్లు వచ్చాయనీ, భయంకరంగా ఉందని తెలిపారు. రూ.40వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.లక్షా 30వేల కోట్లు పెంచారనీ.. అయినప్పటికీ ఇంకా దాన్ని పూర్తి చెయ్యలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందని.. తానే సూపర్ ఇంజినీర్ అని సీఎం కేసీఅర్ భావిస్తారని సెటైర్ వేశారు. కేసీఆర్ రోడ్ల గురించి మాట్లాడుతున్నారని.. కేంద్రం నిధులివ్వకుంటే రోడ్లు ఎక్కడికి అంటూ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలకంగా వ్యవహరించిందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ ఎన్నికలను డబ్బు మయం చేశాడని.. రాష్ట్రంలో సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు. తెలంగాణ తానే తెచ్చానని కేసీఆర్ అంటున్నారు.. బీజేపీ మద్దతు ఇవ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రొడక్ట్ అని.. కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కూడా కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తోందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఐదేళ్లలో వచ్చే వ్యతిరేకత కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఐదు నెలల్లోనే వచ్చిందని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు డబ్బు పంపించేందుకు కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు.




Updated : 5 Nov 2023 7:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top