Praja Palana : ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ప్రజా పాలన'
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ‘ప్రజా పాలన’ అనే కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ప్రజాప్రతినిధులంతా ప్రజల వద్దకే వెళ్లి 6 గ్యారంటీల దరఖాస్తులతో పాటు వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ, పట్టణ సభలు నిర్వహించేలా ప్రణాళికలు చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న అప్లికేషన్లను పరిశీలించిన ప్రభుత్వం, వాటిలో చాలా ఫిర్యాదులు, వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే ‘ప్రజా పాలన’ కు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయులకు రావాలని, ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించి, విధివిధానాలు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) ఉదయం 8.30 గంటలకు రావాలని రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నందున ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది.