Harish Rao : చిదంబరానికి దమ్ముంటే ఆ పనిచేయాలి.. హరీశ్ సవాల్
X
కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఏపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఆయనకు అవగాహన లేదని కాంగ్రెస్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గమంటున్నారు. చిదంబరం కారణంగానే తెలంగాణ యువత ప్రాణాలు పోయాయని మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వాపసు తీసుకుంటున్నట్టు ఆనాడు చిదంబరం చేసిన ప్రకటనతో వల్లే యువకులు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ‘‘ఆయన మాటలు దొంగే దొంగ అన్నట్లు ఉన్నాయి. హంతకుడే సంతాపం తెలుపుతున్నాడు. చరిత్ర తెలియది కేసీఆర్కు కాదు చిదంబరానికే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం బలిదానం చేసిన పొట్టిశ్రీరాములును చిదంబరం ప్రశంసించడం దొంగే దొంగ అన్నట్టు ఉంది. పొట్టి శ్రీరాములు మరణానికి కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?’’ అని మండిపడ్డారు. చిదంబరానికి దమ్ముంటే తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని చూపాలని సవాల్ విసిరారు.
భాషా ప్రాతిపదికగానే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందని, అప్పట్లో తెలంగాణ రాష్ట్రమనేది లేదని చిదంబరం చేసిన వ్యాఖ్యలకు హరీశ్ ఘాటుగా జవాబిచ్చారు. ‘‘అప్పడు హైదరాబాద్ రాష్ట్రం ఉండేదని ఆయనకు తెలియదా? కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది. ఆయన నాయకత్వంతో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలించింది. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ఆర్బీఐ నివేదికలు చూసుకుని మాట్లాడాలి. కాంగ్రెసే కాదు, ఏ పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారు. ఎన్నికల్లో మేం ఘన విజయం సాధిస్తాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.