Harish Rao : దుమ్మురేపిన హరీశ్ రావు.. 60 రోజుల్లో 80..
X
బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. రెండు నెలలకుపైగా అలుపెరగకుండా రాష్ట్రం నలుమూలా సుడిగాలిలా చుట్టి గులాబీ జెండాను రెపరెపలాడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ విపక్షాలను విమర్శలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. హరీశ్ రావు 60 రోజుల్లో 80కిపైగా సభల్లో, రోడ్ షోల్లో పాల్గొనారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. పార్టీ ప్రచార సభలో శ్రేణులను ఉత్సాహపరిచారు. కారులో, హెలికాప్టర్‌లో ఎలా వీలైతే అలా ప్రయాణించి ప్రజలకు బీఆర్ఎస్ హామీలను వివరించారు. కేడర్‌తో ఉత్సాహంగా పనిచేయించానికి టెలికాన్ఫరెన్సులు కూడా నిర్వహించారు.
గణాంకాలతో, ఘాటు విమర్శలతో..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, దళితబంధు, రైతులకు ఉచిత కరెంట్, కల్యాణ లక్ష్మి తదితర పథకాలతో ప్రజలు ఎలా లబ్దిపొందారో హరీశ్ వివరించారు. పదేళ్లలో జరిగిన అభివృద్ధిని గణాకాతో చెప్పారు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయబోయేదీ ఆసక్తిగా వివరించారు. మూడోసారి ఎన్నికైతే అమలు చేసే మేనిఫెస్టో అంశాలను కూలంకషంగా వెల్లడించారు. మూడోసారి గెలిస్తే సన్న బియ్యం 400 లకే సిలిండర్ ఇస్తామని చెప్పారు. ‘‘రిస్కు వద్దు కారుకే ఓటు గుద్దు’’ అని ఆయన ఇచ్చిన నినాదాలు వైరల్ అయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను వివరించని ఆయన వాటికి ఓటేస్తే గంగలో కలిపినట్టేనన్నారు. కాంగ్రెస్ ‘స్కాంగ్రెస్’ అని, తెలంగాణ వెనకబడ్డానికి ఆ పార్టీనే కారణమని దుయ్యబట్టారు. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఎండగట్టారు.ఓవైపు ప్రచారంలో పాల్గొంటూ మరోవైపు తెలంగాణ భవన్, ఇతర జిల్లాల్లో ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు. టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.
అన్ని వర్గాలతో..
అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్‌వైపు ఆకర్షించేందుకు హరీశ్ రావు ఎంతో కష్టపడ్డారు. ఉద్యోగ, ప్రైవేటు ఉద్యోగుల, కుల, మత సంఘాలతో భేటీ అయ్యారు. వారి సంక్షేమం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లపై అసంతృప్తితో ఉన్న నేతలను గులాబీ గూటికి ఆహ్వానించారు.
ఎక్కడెక్కడ?
హరీశ్ అక్టోబర్ నెలలో మెదక్, తాండూర్, ములుగు, నర్సంపేట, డోర్నకల్, నకిరేకల్, తుంగతుర్తి, మహేశ్వరం, కల్వకుర్తి, దుబ్బాక, గజ్వేల్, మక్తల్, కొడంగల్, దేవరకద్ర, జుక్కల్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, మానకొండూర్, సిద్దిపేట, మంచిర్యాల, చెన్నూరు, జహీరాబాద్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్, అదిలాబాద్, స్టేషన్ ఘనపూర్ నియోజకర్గాల్లో ప్రచారం చేశారు. నవంబర్ నెలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, మెదక్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్ చెరు, సిద్దిపేట, మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, ఉప్పల్, హుజురాబాద్, ములుగు, బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, నారాయణ్ ఖేడ్, మానకొండూరు, మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, జనగాం, ఆలేరు, భోంగిర్, రాజేంద్రనగర్, కొడంగల్‌లలో సభలు సమావేశాలు నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ విధానాల గురించి అందరికీ అర్థమయ్యేలా చెబుతూ బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుని వివరించారు.