TS Assembly Elections 2023 : త్రిముఖ పోరులో.. కరెంట్ రాజకీయం
X
తెలంగాణలో ‘కరెంట్’ హాట్ టాపిక్ అయింది. ప్రధాన పార్టీల రాజకీయాలన్నీ కరెంట్ పైనే నడుస్తున్నాయి. ఏ పార్టీ చూసినా కరెంట్ సమస్యనే లేవనెత్తుకున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రయాంగిల్ పోరులో కరెంట్ సమస్యపైనే ఒకరినొకరు టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తుందని, మళ్లీ పాత రోజులనే తెస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేస్తుంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయలేదని వాళ్ల కరెంట్ కష్టాలు అలానే ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే 24 గంటల విద్యుత్ ఉండదని, రైతులు మళ్లీ కష్టాలు పడాల్సి వస్తోందని సీఎం కేసీఆర్ ప్రతి సభలో హస్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. అధికార పార్టీ ఎక్కడ 24 గంటల కరెంట్ ఇస్తుందని ప్రశ్నిస్తుంది. రైతులకు కూడా కరెంట్ సమస్యలు ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మాయ మాటలు చెప్తున్నారని చెప్పుకొచ్చారు. 24 గంటల ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని, తాము గెలిస్తే కచ్చితంగా నిరంతర విద్యుత్ ఇస్తామని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ రెండు పార్టీలను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టకుండా కేంద్రాన్ని, ప్రజలకు మోసం చేస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డిస్కంలు కట్టకుండా ఎగ్గొడుతున్నారని, వాడిన కరెంట్ లెక్కలు చూపించమంటే తప్పించుకుంటున్నారని నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామణ్ తీవ్రంగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలో వస్తే.. మళ్లీ చీకటి రాజ్యమేనని ప్రజలకు సూచిస్తున్నారు. కాగా ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టింది. రైతుల బాగుకోసం తాము కరెంట్ ఇస్తుంటే.. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల సొమ్మును లాక్కునూ ప్రయత్నం చేస్తున్నారని బీజేపీపై మండిపడుతున్నారు.