Telangana Six Mlcs : 6 ఖాళీ ఎమ్మెల్సీ పోస్టులు వీళ్లకేనా?
X
రాజకీయ నాయకులకు ఏదో ఒక పదవి తప్పసరిగా ఉండాలి. బతకడానికి గాలి, నీళ్లు ఎంత అవసరమో రాజకీయాలు నడపడానికి పదవులు కూడా అంతే అవసరం. ఎన్నికల్లో అందరూ గెలవలేరు కాబట్టి గెలవలేని వారు వేరే దారిలో పదవులు పొందుతుంటారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్మొరేషన్ చైర్మన్, తదితర నామినేటెడ్ పోస్టులు అలాంటివే.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లకు, విజయాలకు నోచుకోని కొందరు ఎమ్మెల్సీ సీట్లపై కన్నేశారు. శాసన మండలిలో ఖాళీగా ఉన్న ఆరు సీట్లను దక్కించుకునే అదృష్టవంతులెవరని చర్చలు సాగుతున్నాయి.
నలుగురు ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంలో వారి ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. గవర్నర్ కోటాలో మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవులు చేపట్టిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ నుంచి, పాడి కౌశిక్‌రెడ్డి హజూరాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ అయిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి గెలిచారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
వీరు అసెంబ్లీకి వెళ్లడంతో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు, గవర్నర్ కోటాలోని రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ రేపోమాపో కసరత్తు ప్రారంభించనుంది. గ్రాడ్యుయేట్స్, స్థానిక సంస్థల కోటా పదవులకు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు జరుపుతారు. ఎమ్మెల్యే కోటాలోని రెండు సీట్లను అసెంబ్లీలో పార్టీల బలాన్ని భర్తీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు, బీఆర్‌ఎస్‌కు ఒక సీటు వస్తుంది. కాంగ్రెస్ రెండు సీట్లకు అభ్యర్థులను బరిలోకి దింపితే ఎన్నికలు జరపాల్సి వస్తుంది.
ఖాళీ సీట్లలో కొలువుదీరే నేతల పేర్లు కొన్ని తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్‌లలో ఒకరికి సీటు గ్యారంటీ అని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్‌కు ఓ సీట్లు కేటాయించడం గ్యారంటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో సీనియర్ నేత, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో ఎమ్మెల్సీ పోస్టులకు భారీ డిమాండ్ నెలకొంది.
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఓ స్థానాన్ని అప్పగించే అవకాశం ఉంది. ఆయనను రాజ్యసభకు పంపే ఆలోచన కూడా ఉందంటున్నారు. ఎన్నికల్లో పొత్తు కింద సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాల్సి ఉంది. వీటిలో ఒకటి గవర్నర్ కోటా నుంచి ఇవ్వాలని కామ్రేడ్లు కోరుతున్నారు. సీపీఐ నుంచి సీట్లు కోరుతున్నవారిలో ఉన్నారు. చాడ వెంకట రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, బాల మల్లేశంలు ఉన్నారు. ఉన్న ఆరు సీట్లకు ఇంతమంది పోటీ పడుతుండడంతో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అందరితో చర్చలు జరిపి బుజ్జగించి వ్యవహారాన్ని చక్కబెట్టాలని ప్రయత్నిస్తోంది.