Patel Ramesh Reddy : కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద హైడ్రామా
X
కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి లపై రమేష్ రెడ్డి అనుచరులు తిరగబడ్డారు. స్థానికంగా ఉన్న కార్యకర్తలు వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి సూచన మేరకు శాంతించిన కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లనిచ్చారు. ఇంట్లోనే చర్చలు జరుగుతున్న క్రమంలో బయట ఉన్న కార్యకర్తలు ఓపిక నశించి రమేష్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకోవద్దని ఒకవేళ అదే జరిగితే సూర్యాపేటలో తిరిగే పరిస్థితి లేదని కార్యకర్తలు ఏకంగా రమేష్ రెడ్డికి చెప్పారు.
బుజ్జగించేందుకు వచ్చిన నాయకులు బయటికి వెళితే వాళ్లపై దాడి చేసేందుకు కూడా కార్యకర్తలు వెనుదిరిగని పరిస్థితి ఉంది. ఇలా ఉంటే బుజ్జగింపులకు వెనక్కి తగ్గని పటేల్... కాంగ్రెస్ నేతలు కూడా తనకే మద్ధతివ్వాలని కోరారు. ఓ వైపు చర్చలు కొనసాగుతూ ఉండగా పటేల్ రమేష్ రెడ్డి సతీమణి లావణ్య మీడియాతో మాట్లాడుతూ సర్వే నివేదికలన్నీ పటేల్ రమేష్ రెడ్డికి అనుకూలంగా ఉండగా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరగడానికి మొత్తం కారణం ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అని, రూ.30 కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారని ఆరోపించారు.