తెలంగాణలో బెల్ట్ షాపులు బంద్..!
X
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు హామీలను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా బెల్ట్ షాపుల మూసివేతకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్న హామీని వీలైనంత త్వరగా అమలు చేయాలని, అందుకోసం పూర్తి కసరత్తు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బెల్ట్ షాపులు మూసివేసేందుకు ఎక్సైజ్ అధికారులు పూర్తి ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో మొత్తం 2620 వైన్స్ షాపులు ఉన్నాయి. 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 4 నుంచి 10కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపులు పరిమిత సమయంలో పని చేస్తున్నప్పటికీ.. బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు ఓపెన్ చేయబడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే యువత తాగుడికి బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలోనే మహిళా సంఘాలు, సామాజిక సేవా సంస్థలు బెల్ట్ షాపుల మూసివేతకు డిమాండ్ చేస్తున్నాయి.