Lok Sabha : విపక్షాల ఆందోళన.. లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా..
X
పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ పార్లమెంట్ ప్రారంభంకా గానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్ సభలో గందరగోళం ఏర్పడగా.. స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. పార్లమెంట్ నుంచి 92మందిని సస్పెండ్ చేయడంపై వారు మండిపడ్డారు. ఈ నిరసనలో ఖర్గే, శరద్ పవార్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఒక్కరోజే ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్లమెంట్ సమావేశాల బహిష్కరించాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. కాగా లోక్ సభలో కేంద్రం ఇవాళ కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఐపీసీని భారత న్యాయ సంహితగా, సిఆర్పీసీని భారత నాగరిక సురక్ష సంహితగా, ఎవిడెన్స్ యాక్టుకు భారత సాక్ష బిల్లుగా కేంద్రం పేరు మార్చింది. లోక్ సభలో బిల్లులపై హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభించనున్నారు. అయితే కొత్త బిల్లులకు హిందీ పేర్లు పెట్టడంపై విపక్షాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.