Revanth Reddy : కాంగ్రెస్పై కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తుండు : రేవంత్
X
సీఎం కేసీఆర్ కొడంగల్ను దత్తత తీసుకుని ఏం అభివృద్ధి చేశాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ను అభివృద్ధి చేయకపోగా.. రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను అడ్డు తొలగించేందుకు సిద్ధిపేట్, గజ్వేల్, సిరిసిల్ల నుంచి ముగ్గురు నేతలు గొడ్డలితో బయలుదేరారని.. వారికి కొడంగల్ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు.
కొడంగల్లో తానే చేసిన అభివద్ధి తప్ప.. కొత్తగా చేసిన అభివృద్ధి ఏమి లేదని రేవంత్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న 10ఏళ్లలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశానని చెప్పారు. కానీ గత ఎన్నికల వేళ కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్కు ఓటేస్తే.. ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలు వచ్చాయా..? పాలమూరు ఎత్తిపోతల పూర్తయిందా..?.. రైల్వే లైన్ తెచ్చిండా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్పై కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంట్ కట్, రైతు బంధు కట్ అవుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ తెచ్చిందే కాంగ్రెస్ అని.. రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ది అన్నారు. రైతు భరోసా ద్వారా రైతులకు 15వేల రూపాయలు ఇస్తామన్నారు. కాబట్టి కొడంగల్ ప్రజలు ఐదువేలకు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా తనకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.