కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆ రెండు పార్టీల కుట్రలు - రేవంత్ రెడ్డి
X
సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ వస్తే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి రెండు పార్టీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అన్నాయి. గెలుపుపై నమ్మకం లేని బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఓట్లను చీల్చి హంగ్ ఏర్పడేలా ప్లాన్ చేస్తోందని రేవంత్ అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో జరిగిన క్రైస్తవ హక్కుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.
కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా బీజేపీ, బీఆర్ఎస్‌లు కుట్రలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు చేసే దొంగ రాజకీయాలను గమనిస్తున్నారని చెప్పారు. సోనియా గాంధీని విమర్శించే నాయకులంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. డిసెంబర్ నెలను మిరాకిల్ మంత్ అంటారని, 2009 డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చినట్లే.. 2023 డిసెంబర్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.