BJP Senior Leaders : బీజేపీకి షాక్..! కాంగ్రెస్లోకి ఇద్దరు సీనియర్ నేతలు..?
X
లోక్సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నేతల వలసలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ వైపు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. వారిద్దరూ త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. 2014లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్ష ధోరణి నచ్చక ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన కొండా కాంగ్రెస్లో చేరారు. 2018 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్లో పరిణామాలు నచ్చకపోవడం, కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని భావించిన ఆయన.. కమలం పార్టీలో చేరారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. అప్పటి వరకు బలం పుంజుకుంటున్న బీజేపీ ఒక్కసారిగా ఢీలా పడింది. అదే సమయంలో కాంగ్రెస్ కర్నాటక ప్రజల తీర్పు ఇచ్చిన జోష్ తో దూసుకుపోయింది.
కర్నాటక ఫలితాల అనంతరం కాంగ్రెస్ పుంజుకోవడం, కొన్నాళ్లకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఒక్కొక్కరుగా బీజేపీని వీడారు. ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత విజయశాంతి, వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్లోకి వెళ్లారు. ఆ సమయంలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వెళతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. విషయం బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో హుటాహుటిన వారిని ఢిల్లీకి పిలిచి నచ్చజెప్పినట్లు వార్తలు వచ్చాయి.
నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా శేరిలింగపల్లి అసెంబ్లీ టికెట్ తమకే కేటాయించాలని జనసేన బీష్మించుకోగా.. తాను సూచించిన అభ్యర్థికే ఇవ్వాలని కొండా విశ్వేశ్వర రెడ్డి పట్టుబట్టారు. దీంతో బీజేపీ హైకమాండ్ చివరి నిమిషం వరకు ఆ స్థానం నుంచి బరిలో నిలిపే అభ్యర్థిని ప్రకటించలేదు. చివరకు కొండా సూచించిన వ్యక్తికే టికెట్ ఇచ్చి ఆయన పార్టీ మారకుండా కాపాడుకుంది. ఒకవేళ శేరిలింగంపల్లి టికెట్ ను బీజేపీ జనసేనకు కేటాయించి ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి అప్పుడే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలకే పరిమితం కావడం, ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ కోల్పోవడంతో కొండా విశ్వేశ్వర రెడ్డి పునరాలోచనలో పడ్డట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. మిత్రుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో కొండా కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం మళ్లీ మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికైన వెంటనే కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ కొండా ట్వీట్ చేయడం, కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడం కూడా అనుమానాలను మరింత బలపరిచింది. మరోవైపు కాంగ్రెస్ సైతం కొండా పార్టీలో చేరితో చేవెళ్ల టిక్కెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే పార్టీ మార్పు వార్తల్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొట్టివేసినా ఆయన త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే బీజేపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీని వీడటమే ఉత్తమమని ఆయన నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మరింత బలాన్ని చేకూర్చింది. త్వరలో తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నారంటూ ఆయన చేసిన ట్వీట్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో పాటు కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే పార్టీ హ్యాండిల్ నుంచి ఆ వ్యక్తి ఎవరనే లీక్ కూడా ఇచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటూ ట్వీట్ చేశారు. బీజేపీలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఈటల మాత్రమే కావడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.