Tula Uma : కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన తుల ఉమ
X
బీజేపీకి గుడ్ బై చెప్పిన సీనియర్ మహిళా నేత తుల ఉమ బీఆర్ఎస్ చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో ఆమె బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా, కరీంనగర్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆహ్వానం మేరకు తుల ఉమ బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చారు. ఆమెతో పాటు ముఖ్య అనుచరులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ తుల ఉమతో పాటు అందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తుల ఉమకు బీజేపీ వేములవాడ టికెట్ ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో బీఫాం ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్.. తుల ఉమకు టికెట్ ఇచ్చి వెనక్కి తీసుకోవడం బాధాకరమని అన్నారు. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేకతకు నిదర్శనమని విమర్శించారు. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని బీజేపీ బిల్డప్ మాత్రమే ఇస్తోందని కేటీఆర్ సటైర్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డగా బీఆర్ఎస్ ఇంటి బిడ్డగా సేవలందించిన తుల ఉమకు బీజేపీ ఇలాంటి అవమానం జరగడం బాధగా ఉందన్నారు. బలహీన వర్గాల ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ అన్నారు.