Vivek Venkataswamy : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై.. నన్ను జైల్లో వేసే కుట్ర చేస్తున్నై: వివేక్
X
చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై కుట్ర చేస్తున్నయని మండిపడ్డారు. ఓటమి భయంతోనే తనపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని.. కుట్ర పూరితంగానే తనపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టపరంగానే తన కుటుంబ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయన్నారు. బీజేపీలో ఉన్నప్పుడు తానెప్పుడూ పార్టీ కోసం నిజాయితీగా పనిచేశానని.. ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు తనపై ఎలాంటి దాడులు జరగలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనపై దాడులు జరుపుతున్నారని అన్నారు. హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో పనిచేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన తనను పార్టీ గౌరవించలేదని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో బాల్క సుమన్ అమిత్ షాకు ఫోన్ చేసి చెప్తే తనపై ఐటీ దాడులు జరుపుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని దాడులు జరిపినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తన కంపెనీకి చెందిన లావాదేవీలన్నింటినీ చెక్ చేశారని, మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు జరిపి వాటి గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానన్నారు.
తమ సంస్థలన్నింటిలో చట్ట ప్రకారం లావాదేవీలు జరుగుతాయని, తప్పుడు వార్తుల రాయడం సరికాదని మీడియాపై మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో దయనీయ పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ కు తాను డబ్బిచ్చి సాయం చేశానని, ఆ విషయం మర్చిపోయి తనపై దాడులు జరిపించడం సరైంది కాదని మండిపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. ఈటల రాజేందర్ భూముల విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న నాయకులెవరికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదని నిలదీశారు. తమ కంపెనీల్లో రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయన్న మాట అవాస్తవం అని చెప్పారు. తన మిత్రుడి కంపెనీని చూసుకుంటున్నానని.. ఆ కంపెనీ షేర్లు అమ్మితే రూ.50 కోట్ల లాభం రాగా అందులో రూ.9 కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టినట్లు తెలిపారు. ఆ వివరాలేవి అధికారులు బయటకు ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు.