White Paper : రాష్ట్ర ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో వైట్ పేపర్.. ఇంతకీ శ్వేతపత్రం అంటే ఏంటి..?
X
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. 42 పేజీల ఈ వైట్ పేపర్ను సభ్యులకు అందించారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని కానీ ప్రభుత్వ వనరులు సక్రమంగా ఉపయోగించలేదని భట్టి ఆరోపించారు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. గత పదేళ్లలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో శ్వేత పత్రం విడుదల చేసినట్లు భట్టీ ప్రకటించారు. ఇంతకీ శ్వేతపత్రం అంటే ఏమిటి? అందులో ఏం ఉంటుంది?
ప్రభుత్వం ఏదైనా ఒక అంశంపై విడుదల చేసే నివేదికను శ్వేతపత్రం (వైట్ పేపర్) అంటారు. అందులో ఒక అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రభుత్వ అధికారిక సమాచారం ఉంటుంది. అంతే కాదు, ఏదైనా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలను తెలియజేయడంతో పాటు అభిప్రాయాలను ఆహ్వానించేందుకు కూడా శ్వేతపత్రం ఉపయోగపడుతుంది. ఒక బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టడానికి ముందు దాని వివరాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజలకు సమాచారం అందించొచ్చు.
ఉదాహరణకు ఒక రాష్ట్ర ఆదాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ఆ రాష్ట్ర ఆదాయం, ఖర్చులు, ఇప్పటి వరకు పథకాల అమలుచేసిన చేసిన కేటాయింపులు, రాష్ట్రం అప్పులు, నికరంగా మిగిలేది ఎంత అనే విషయాలు లెక్కలతో సహా వివరిస్తారు. శ్వేతపత్రంలో ఒక ప్రభుత్వం తమ పాలసీలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి విధానాలు అనుసరించింది, అందులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించింది, ఇకపై ఎలా ముందుకెళ్లబోతున్నామో తెలుపుతుంది.
శ్వేతపత్రం అనే పదాన్ని బ్రిటన్ ప్రభుత్వం తొలిసారి ఉపయోగించింది. 1922లో చర్చిల్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఓ రిపోర్టును శ్వేతపత్రం అని పిలిచారట. యూదులపై పాలస్తీనా హింసపై ఆ దేశంలోని తొలి బ్రిటీష్ హైకమిషనర్ సర్ హెర్‌బర్ట్ శామ్యూల్ రూపొందించిన ముసాయిదాను తొలి శ్వేతపత్రం (చర్చిల్ మోమోరాండం)గా చెబుతారు. బ్రిటన్ పార్లమెంట్ నిర్వచనం ప్రకారం 'ప్రభుత్వ విధానాలను, చట్టపరమైన ప్రతిపాదనలను, బిల్లు రూపం దాల్చడానికి ముందు జరిగే వ్యవహారాలను, ప్రజల అభిప్రాయలను సేకరించే ప్రభుత్వ నివేదకనే శ్వేతపత్రం". బ్రిటన్ నుంచి భారత్, కెనడా, అమెరికాతో పాటు అనేక దేశాలు ఈ శ్వేతపత్రం భావనను పాలనలో భాగం చేసుకున్నారు.
కొన్ని దేశాల్లో శ్వేతపత్రంతో పాటు గ్రీన్ పేపర్ విధానం కూడా అమల్లో ఉంది. అక్కడ శ్వేతపత్రానికి ముందు గ్రీన్ పేపర్ విడుదల చేస్తారు. ఒక అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు, చర్చల సారాంశం, సలహాలు ఇతర విషయాలపై ప్రభుత్వం విడుదల చేసే నివేదికను గ్రీన్ పేపర్‌గా పిలుస్తారు. శ్వేతపత్రాల వల్ల ప్రభుత్వ విధాన నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు.