Mahua Moitra: 'వస్త్రాపహరణ చేశారు'.. ఎంపీ మహువా సంచలన ఆరోపణలు
X
సొమ్ములు స్వీకరించి పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్ని ఎదుర్కొంటున్న TMC ఎంపీ మహువా మొయిత్రా.. ఎథిక్స్ కమిటీ ఛైర్‌పర్సన్ వినోద్ కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వస్త్రాపహరణ చేశారంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆమె లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తూ.. సదరు ఛైర్ పర్సన్ తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలు కాకుండా.. తన పరువుకు నష్టం కలిగించేలా పక్షపాతంతో వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. ఎథిక్స్ కమిటీ ఎథిక్స్ కోల్పోయిందని.. కాబట్టి ఆ కమిటీకి వేరే ఇంకేదైనా పేరు పెట్టాలన్నారు.
డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న కేసులో విచారణ నిమిత్తం.. గురువారం పార్లమెంటు నైతిక విలువల సంఘం (ఎథిక్స్ కమిటీ) ఎదుట పలువురు విపక్ష ఎంపీలతో హాజరయ్యారు మహువా మొయిత్రా. అయితే కమిటీ సంబంధం లేని చెత్త ప్రశ్నలు అడిగారంటూ ఆమె మధ్యలోనే బయటకొచ్చారు. ఆమెతోపాటు బీఎస్పీ ఎంపీ డ్యానిష్ అలీ, గిర్ధారీ యాదవ్‌తోపాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్యానెల్ పలు వ్యక్తిగత అసభ్యకర, అనైతిక ప్రశ్నలు వేసిందని మొయిత్రా మండిపడ్డారు. 'అసలు అదేం మీటింగ్..? వారు నీచమైన ప్రశ్నలు వేశారు. చూడండి.. నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా?' అని సమావేశం నుంచి బయటకు వెళ్తూ ఆమె విలేకరులను ప్రశ్నించారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని, అసలు ఇది ఎథిక్స్ కమిటేనా అని ప్రశ్నించారు.
My letter emailed to the Honourable @loksabhaspeaker pic.twitter.com/2wGlWTTej6
— Mahua Moitra (@MahuaMoitra) November 2, 2023
తన పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రశ్నించడం ద్వారా ఎథిక్స్ కమిటీ ఛైర్‌పర్సన్ పక్షపాతంతో వ్యవహరించారని, ఆయన తీరుతో 11మంది కమిటీ సభ్యుల్లో ఐదుగురు సమావేశాన్ని బహిష్కరించినట్లు మహువా తెలిపారు. లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సంబంధించిన పోర్టల్.. లాగిన్, పాస్‌వర్డ్ షేరింగ్‌కు సంబంధించిన నిబంధనలు వెల్లడించాలని లోక్‌సభ సచివాలయానికి రాసిన లేఖలో మహువా కోరారు.
మరోవైపు, విపక్ష సభ్యుల విమర్శలపై ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకార్ స్పందించారు. విచారణకు వారు ఏమాత్రం సహకరించలేదన్నారు. తనపైనా, కమిటీ పనితీరుపైనా అభ్యంతరకరమైన పదాలను వాడారని ఆరోపించారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికే మహువా, డ్యానిష్ అలీ, గిర్దారీ యాదవ్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు కమిటీని నిందిస్తూ ఆకస్మాత్తుగా బయటకొచ్చేశారన్నారు. దీనిపై ప్యానెల్ మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని వినోద్ వెల్లడించారు.