ఇదో అపూర్వ అవకాశం.. దక్షిణాదిలో ఏ సీఎంకు సాధ్యంకాలేదు.. ఇప్పుడు కేసీఆర్ వంతు
X
హాట్రిక్ సీఎం.. బీఆర్ఎస్ నేతల నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. స్వరాష్ట్ర సాధన, రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అంశంగా తీసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం కావాలని అప్పుడే రాష్ట్రం పూర్తి స్తాయిలో అభివృద్ది చెందుతుందని చెప్పుకొస్తున్నారు. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన పథకాలు, పించన్లు.. కట్టిన ప్రాజెక్టులను వివరిస్తూ.. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలన్నీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు చేస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదే ఆ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈసారి కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో (కామారెడ్డి, గజ్వేల్) పోటీ చేస్తున్నారు. చరిత్రలో ఇలా కొంతమందే చేశారు. కానీ స్వరాష్ట్రంలో రెండు చోట్ల నిలబడుతున్న వ్యక్తి కేసీఆర్ ఒక్కరే.
ఈ క్రమంలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారా? చరిత్ర లిఖిస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే.. హ్యాట్రిక్ సీఎంను గెలిపించుకున్న చరిత్ర దక్షిణాదిలో ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి లేదు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు నుంచి.. ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వరకు తెలుగు నాట మూడు సార్లు సీఎంగా గెలిచింది ఎవరూ లేరు. అంతెందుకు నాయకులను దేవుళ్లుగా కొలిచే తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి హేమాహేమీ లీడర్లకే సాధ్యం కాని ఫీట్ ఇది. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని దిగ్గజ నేతలేవరూ సాధించలేని ఘనత ఇది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన కేసీఆర్ కు.. ఇదో అపూర్వ అవకాశం. ఇప్పుడు హాట్రిక్ సీఎం నినాదంతో వెళ్తున్న కేసీఆర్ విజయం సాధిస్తే.. కొత్త చరిత్ర లిఖించడం ఖాయం.
అసెంబ్లీ స్థానాల్లో గెలిచినా..:
ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాల (కామారెడ్డి, గజ్వేల్) నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన చరిత్ర ఎవరికీ లేదు. 1989లో టీడీపీ నుంచి ఎన్టీఆర్ హిందూపురం, కల్వకుర్తి స్థానాల్లో పోటీ చేశారు. అప్పుడు హిందూపురం నుంచి గెలిచినా.. కల్వకుర్తిలో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల్లో పోటీ చేయగా.. తిరుపతిలో గెలిచి, పాలకొల్లులో ఓడిపోయారు. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. కాగా ఇప్పుడు కేసీఆర్ పోటీ ఆసక్తి రేకిస్తోంది. ఎందుంటే.. గజ్వేల్ లో కేసీఆర్ కు పోటీగా ఈటల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కేసీఆర్ కు గట్టిపోటీనే. ఇప్పుడు కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో గెలిస్తే సరికొత్త చరిత్ర తిరగరాయడం ఖాయం.