Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహిళామణులు వీరే
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. 119 స్థానాలకు గానూ.. 64 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలనుంచి 33 మంది మహిళలు పోటీ చేయగా.. 10 మంది మహిళలకు ఓటర్లు పట్టంగట్టారు. వారిలో ఇదివరకే గెలిచిన అనుభవం ఉన్న వాళ్లు ఉండగా.. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న వారు కూడా ఉన్నారు.
సబితా ఇంద్రారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీచేసిన సబితా ఇంద్రారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ పై విజయం సాధించారు.
సునీతా లక్ష్మారెడ్డి: నర్సాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీచేసిన సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలుపొందారు.
దనసరి అనసూయ (సీతక్క): ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క.. బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.
కొండా సురేఖ: వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ.. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌పై గెలుపొందారు.
ఉత్తమ్ పద్మావతి: కోదాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలిచారు. 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య చేతిలో పరాజయం పాలైన ఆమె.. తిరిగి 2023 ఎన్నికల్లో అదే అభ్యర్థిపై విజయం సాధించడం గమనార్హం.
లాస్య నందిత: సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన లాస్య నందిత.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెలను ఓడించారు. కంటోన్మెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి శ్రీ గణేశ్ రెండో స్థానంలో నిలవగా.. వెన్నెల మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
కోవాలక్ష్మీ: ఆసిఫాబాద్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోవా లక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్, బీజేపీ అభ్యర్థి అజ్మీరా ఆత్మారామ్ నాయక్‌లపై విజయం సాధించారు.
చిట్టెం పర్ణికా రెడ్డి: నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చిట్టెం పర్ణికా రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్. రాజేందర్ రెడ్డిపై గెలుపొందారు.
మామిడాల యశస్విని రెడ్డి: పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన చిన్నవయస్కురాలిగా నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావును యశస్విని ఓడించారు.
మట్టా రాగమయి: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యపై గెలుపొందారు.