Yashaswini Reddy : జెయింట్ కిల్లర్ యశస్విని రెడ్డి.. దయాకర్ ఢమాల్!!
X
తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 60కుపైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. విచిత్రం ఏంటంటే ఈసారి ఫలితాల్లో రాజకీయ ఉద్ధండడు, ఇంతవరకూ ఓటమన్నదే ఎరుగని సీనియర్ నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్(67)ని... ఎలాంటి రాజకీయ అనుభవం, అండదండలు లేని 26 ఏండ్ల మహిళ దాదాపు 9 వేల ఓట్లతో ఓడించారు. ఆమె మరెవరో కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినిరెడ్డి.
రాజకీయాల్లో ఓనమాలు కూడా సరిగా తెలియని 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజవర్గంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. పాత మహబూబ్‌నగర్ జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగి యశస్విని వివాహం అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కుటుంబ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అయితే ఈ సారి అనూహ్యంగా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణకే చెందిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారంలో రాణించి పాలకుర్తి సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతుండేవారు. ప్రజలకు మరింత సేవ చేయడానికి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే.. భారత పౌరసత్వం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆమెకు బదులు ఆమె కోడలు యశస్విని రెడ్డికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది.
అప్పటివరకూ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, అధికార పార్టీ మంత్రిగా, ఇంతవరకు ఓటమి తెలియని నేతగా పేరున్న ఎర్రబెల్లిపై ఆమె పోటీ చేస్తుండడంతో రాష్ట్రంలో అందరి దృష్టి ఆమెపై పడింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా ఇప్పటి వరకూ ఓటమన్నదే ఎరుగని ఎర్రబెల్లిని.. ఆయన వయస్సులోనూ, అనుభవంలోనూ సగం వయస్సు కూడా లేని ఓ మహిళ ఓడించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.