కొంపముంచిన కోతి...20 గ్రామాలకు కరెంట్ పాయే..!
X
అల్లరి పనులకు పెట్టింది పేరు కోతి. చిత్ర విచిత్ర చేష్టలతో కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరి కొన్ని సార్లు మనుషులకు చుక్కలు చూపెడతాయి. ఒకే సారి ఎటాక్ చేయడం, చేతిలో ఉన్నవాటితో పరుగులు తీయడం..ఇంట్లో, షాపుల్లోకి వచి విలువైన వస్తువులు ఎత్తుకుపోవడం వంటి కోతి చేష్టల గురించి చెప్పనవసరం లేదు. తాజాగా ఓ కోతి చేసిన పని కొంపముంచింది. ఏకంగా 20 గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.
జనగామ జిల్లా వడ్లకొండ 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో కోతి ఆటలాడింది. ఉన్నట్టుండి ట్రాన్స్ ఫార్మర్‌ను పట్టుకొని వేలాడింది. దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ ఫార్మర్ పేలిపోవడంతో కోతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా 20 గ్రామాలకు కరెంట్ పోయింది. సుమారు 3 గంటల పాటు కరెంట్ రాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్లో చిక్కుకున్న కోతిని కిందికి దింపి, మరమ్మతులు నిర్వహించి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.
వడ్లకొండ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి లింగాలఘనపురం, జనగామ, అడవికేశ్వాపూర్, గానుగుపహాడ్, పసరమడ్ల 33/11 కేవీ ఫీడర్లకు విద్యుత్ సరఫరా అవుతుంది. విద్యుత్ సంబంధించి ఎప్పటికప్పుడు రీడింగ్ నమోదు చేసేలా అక్కడే ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ ప్రొటెన్షల్ ట్రాన్స్ ఫార్మర్‌ను కోతి పట్టుకోవడంతో పేలిపోయింది. జంపర్లు పూర్తిగా తెగిపడ్డాయి. గ్రామాలకు కరెంటు పోయింది. అయితే అధికారులు త్వరగా పనులు పూర్తి చేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.