ఎర్ర బ్యాచ్.. గద్దర్‌పై కరాటే కళ్యాణిపై వివాదాస్పద పోస్ట్
X
ప్రజా యుద్ధనౌక, విప్లవ వీరుడు గద్దర్ అనారోగ్యంతో కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆయన అభిమానులు తల్లడిల్లిపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం కేసీఆర్, సీఎం జగన్, మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, అలీ.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గద్దర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. తన పాటలతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అశేషమైన అభిమానులు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇదే సమయంలో సినీనటి కరాటే కల్యాణి గద్దర్‌పై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్ట్ పెట్టింది. ఆయనను ఎద్దేవా చేస్తూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. దీంతో ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు, నెటిజన్లు కరాటే కల్యాణిపై మండిపడుతున్నారు.
మొదట గద్దర్ ఫొటోను ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ ‘ ఎర్ర పాట.. మూగబోయింది.. కన్నీటి వీడ్కోలు.. ఓం శాంతి’ అంటూ పోస్ట్ చేసింది. ఆ తరువాత మరి కాసేపటికే ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌తో మరోపోస్ట్ పెట్టింది. దీంతో ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ అభిమానులు ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పోయినోళ్లని తిట్టడానికి నీకు మనసెలా వచ్చింది? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ కామెంట్లపై కూడా రాత్రి ఫేస్‌బుక్ లైవ్ పెట్టింది కల్యాణ్. కారులో సీటు బెల్టు లేకుండా ప్రయాణిస్తూనే కామెంట్లపై స్పందిస్తూ మరోసారి గద్దర్, ఆయన ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఆయన పాటలతో చాలామంది ప్రభావితం అయిపోయి.. చాలామంది అడవిబాట పట్టినవాళ్లు ఉన్నారు. ఇంతమంది అడవిబాట పట్టారు కదా.. మరి వాళ్ల అబ్బాయి అమెరికాలో ఉన్నారు కదా.. ఇది సూపర్. నేనైతే ఏదైనా ముందు మనం ఆచరించి తరువాత అమలు చేయాలని అనుకుంటాను. కానీ ఆయన అందర్నీ అడవిబాట పట్టించి.. కొడుకుని మాత్రం అమెరికా పంపారు అని కామెంట్స్ చేసింది. అన్ని పోస్ట్‌లు అందరికీ నచ్చక్కర్లేదు.. అందరికీ నచ్చేట్టుగా మనం పోస్ట్‌లు పెట్టలేం.. తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు.. వాళ్ల కోసం మన పద్దతి మార్చుకోవల్సిన పనిలేదు. నన్ను ఎవరు తిట్టినా నేను పట్టించుకోను. మోడీ గారే అందరికీ నచ్చడం లేదు.. నీనెంత? ఇన్ బాక్స్‌లోకి వచ్చి బెదిరిస్తున్నారు. ఆ పోస్ట్ తియ్.. ఈ పోస్ట్ తియ్ అని.. ఏం చేస్తార్రా.. నేను ఎలాగైనా పెడతా.. ఏం చేస్తారో చేసుకోండి. పోస్ట్ తీయకపోతే ఏం చేస్తారో చేసుకోండి.. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. నన్ను బెదిరిస్తే.. ఇంకా బెదిరిస్తా. నా పోస్ట్‌లు నా ఇష్టం ’ అంటూ మాట్లాడింది కల్యాణి.