బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకాక్ పిల్ల..!
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోగో రిలీజ్ కావడంతో షోపై చర్చ మొదలైంది. హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సారి ఎంట్రీ ఇచ్చేది వీళ్లేనంటూ కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ యూట్యూబర్ పేరు ప్రముఖంగా వినిపించింది. హౌస్ లోకి ఆమె ఎంట్రీ పక్కా అని సోషల్ మీడియా కోడై కూయడంతో క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ప్రచారం
సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎంపికపై ప్రస్తుతం బిగ్ బాస్ మేకర్స్ కసరత్తు చేస్తున్నారు. సినిమా, టీవీ, సోషల్ మీడియాల్లో సెలబ్రెటీ స్టేటస్ ఉన్నవారితో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకాక్ పిల్ల పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న సమంతపూడి శ్రావణి పేరు తెరపైకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్లో ఉంటున్న ఆమె వ్లాగ్స్ చేస్తూ పాపులర్ అయింది. అయితే ఆమెను బిగ్ బాస్ నిర్వాహకులు కాంటాక్ట్ అయ్యారని, హౌస్ లోకి ఎంట్రీకి ఆఫర్ ఇచ్చారని పలు యూట్యూబ్ ఛానెళ్లు కోడై కూస్తున్నాయి.
బ్యాంకాక్ నుంచి ఇండియాకు
మరోవైపు ఇటీవలే శ్రావణి కుటుంబం పెట్టేబేడా సర్దుకొని బ్యాంకాక్ నుంచి సొంతూరు తిరిగి వచ్చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నందునే ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయిందని నెటిజన్లు అంటున్నారు. బ్యాంకాక్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నాగార్జున ఆమెను ఎయిర్ పోర్టులో కలిసి పలకరించారని కూడా వార్తలు వచ్చాయి.
క్లారిటీ ఇచ్చిన బ్యాంకాక్ పిల్ల
సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుండటంతో ఎట్టకేలకు బ్యాంకాక్ పిల్ల ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఓ వీడియో చేసి మరీ తాను బిగ్ బాస్ లోకి వెళ్లేదీ లేనిదీ చెప్పింది. హౌస్ లోకి ఎంట్రీపై కుటుంబసభ్యుల అభిప్రాయం తెలుసుకున్న ఆమె.. చివరకు తాను బిగ్ బాస్లోకి వెళ్లడం లేదని చెప్పింది. అసలు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తేల్చేసింది. ఒకవేళ వచ్చినా తన ఇద్దరు పిల్లలను వదిలి దాదాపు 3 నెలలు హౌస్లో ఉండలేనని క్లారిటీ ఇచ్చింది.