చాట్‌జీపీటీ దెబ్బకు ఏసీ టెక్నీషియన్గా మారిన కంటెంట్ రైటర్
X
చాట్‌జీపీటీ.. టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏఐ టూల్కు విశేష ఆదరణ లభిస్తుండడంతో.. దాని ఫలితం పలు ఉద్యోగాలపై పడుతోంది. చాట్‌జీపీటీ రాకతో కంటెంట్ రైటర్ల ఉద్యోగాలు ఊడటం మొదలైంది. ఇప్పటికే ఓ మహిళ తన కాపీ రైటర్ ఉద్యోగాన్ని కోల్పోగా.. తాజాగా ఓ వ్యక్తి తన కంటెంట్ రైటర్ జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు ఆ రైటింగ్ ఫీల్డ్నే వదిలి మరో రంగాన్ని ఎంచుకున్నాడు.
ఎరిక్ ఫెన్ అనే కంటెంట్ రైటర్ తన జాబ్‌ను చాట్‌జీపీటీ రీప్లేస్ చేసిందని చెప్పాడు. పలు వెబ్ సైట్లు, ప్రోడక్టుల వివరాలు రాయడానికి అతడు గంటకు 60 డాలర్లు వసూల్ చేసేవాడు. అయితే చాట్ జీపీటీ అదే పని చేయడంతో తన క్లయింట్లు తనను వద్దనుకున్నారని ఎరిక్ వివరించాడు. జనరేటివ్ ఏఐ సర్వీస్‌తో తమ పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు ఉండగా అతడిపై ఎందుకు డబ్బు వెచ్చించాలని తన క్లయింట్లు భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో తొలి క్లయింట్‌ను కోల్పోయిన అతడు ఆపై తొమ్మిదికి పైగా కాంట్రాక్టులు ఇదే కారణంతో కోల్పోయాడు.
జాబ్ పోవడంతో కుటుంబాన్ని పోషించడం ఎరిక్కు పెనుభారమైంది. ఈ నేపథ్యంలో ఎరిక్ రైటింగ్ ఫీల్డ్నే వదిలేశాడు. ప్రస్తుతం అతడు ఏసీ టెక్నీషియన్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంతేకాకుండా భవిష్యత్లో ప్లంబర్గా కూడా మారాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కంటెంట్ రైటర్లు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అమెరికాలో సగానికిపైగా కంపెనీలు ఉద్యోగుల స్థానంలో చాట్‌బోట్స్ని ఏర్పాటు చేసే ప్రయాత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక్క యూఎస్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు పట్టిపీడిస్తున్నాయి. కానీ ఓపెన్ ఏఐ మాత్రం చాట్ జీపీటీ.. ఉద్యోగుల స్థానాల్ని ఆక్రమించబోదని, ఉద్యోగులకు సాయం చేసేందుకు మాత్రమే పనిచేస్తుందని చెబుతోంది.