Home > వైరల్ > అధికారుల పొరపాటు.. కోటీశ్వరుడైన కారు డ్రైవర్

అధికారుల పొరపాటు.. కోటీశ్వరుడైన కారు డ్రైవర్

అధికారుల పొరపాటు.. కోటీశ్వరుడైన కారు డ్రైవర్
X

ఓ కారు డ్రైవర్‌ ఉన్నపళంగా కోటీశ్వరుడై పోయాడు. తన బ్యాంకు అకౌంట్‌లో ఒక్కసారిగా వేల కోట్ల రూపాయలు వచ్చి చేరడంతో అయోమయానికి గురయ్యాడు. సంతోషంతో ఎగిరిగంతులేశాడు. గట్టిగా అరిచి ఊరంతా చెప్పాలనుకున్నాడు. అది కలో.. నిజమో.. కన్ఫామ్ చేసుకునేందుకు తన స్నేహితుడికి అకౌంట్ కి రూ.21 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. సెకన్లలో ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యింది. అంతే.. కనీసం రూ. 1000 కూడా లేని తన బ్యాంకు అకౌంట్‌లో అంత పెద్దమొత్తంలో డబ్బు వచ్చిపడటంతో తానిక కోటీశ్వరుడయ్యాడని, లైఫ్ బిందాజ్ అనుకున్నాడు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు యాజమన్యం అతనికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్‌ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు ఉంది. తన బ్యాంకు ఖాతాలో కేవలం 105 రూపాయలే ఉండగా ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చాయా? అని సందేహించాడు. అసలు ఇది నిజమా.. కాదా అని తెలుసుకునేందుకు అదే రోజు రాజ్‌ కుమార్‌ తన స్నేహితుడికి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.21,000 బదిలీ చేశాడు. ఆ మొత్తాన్ని స్నేహితుడికి పంపిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 9 వేల కోట్ల రూపాయలు చేరడం నిజమేనని భావించి సంబరపడ్డాడు.

ఈ లోపే అకౌంట్ లో ఉన్న మిగిలిన డబ్బును తూత్తుకుడిలోని బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ అధికారులు వెనక్కి తీసుకున్నారు. రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసిన అధికారులు.. పొరపాటున తన ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయినట్లు తెలిపారు. తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని సూచించారు. చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు రాజ్‌కుమార్‌ తరఫున న్యాయవాదులు వెళ్లి మాట్లాడటంతో స్నేహితుడికి అతను పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం.



Updated : 22 Sept 2023 8:34 AM IST
Tags:    
Next Story
Share it
Top